వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పాలకవర్గం తన ఐదేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. బుధవారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన నిర్వహించిన ఆఖరి కౌన్సిల్ సమావేశంలో నగర అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
నగరంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 76.56 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గత ఐదేళ్ల కాలంలో రూ. 3331 కోట్ల భారీ నిధులతో మొత్తం 6676 అభివృద్ధి పనులు చేపట్టినట్లు మేయర్ వివరించారు. ఇందులో ఇప్పటికే 60% పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
రాజకీయ పార్టీలకు అతీతంగా పాలకవర్గం మొత్తం ఏకతాటిపై నిలిచి నగరాభివృద్ధి కోసం కృషి చేయడం వల్లే ఈ స్థాయిలో ప్రగతి సాధ్యమైందని ఆమె అన్నారు.
”వరంగల్ మహానగరానికి ఐదేళ్ల పాటు సేవ చేసే అవకాశం రావడం నా జీవితంలో ఎంతో గర్వంగా ఉంది. అభివృద్ధి విషయంలో మా పాలకవర్గం అద్భుతమైన ఫలితాలను సాధించింది.”— గుండు సుధారాణి, వరంగల్ మేయర్
పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, కౌన్సిల్ సభ్యులు మరియు అధికారులు కలిసి ఐదేళ్ల జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. వరంగల్ నగర రూపురేఖలను మార్చడంలో ప్రతి ఒక్కరి సహకారం ఉందని మేయర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.


