హన్మకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (TGNPDCL) పరిధిలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం ఏమాత్రం సరైంది కాదని 327 యూనియన్ నేత నీలారపు శ్రీనివాస్ విమర్శించారు.
హన్మకొండ నక్కలగుట్టలోని ఎస్‌ఈ (SE) కార్యాలయం వద్ద ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె నేటికి ఆరో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులకు సమ్మె శిబిరాన్ని సందర్శించిన శ్రీనివాస్ తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా కాలయాపన చేయడం తగదని మరియు తక్షణమే ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయి సిబ్బందికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


