హనుమకొండ: దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
మంగళవారం ఇంజనీర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అంకితభావంతో పనిచేసి మెరుగైన రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేసిన కీలక ప్రకటనలు:
శిథిలావస్థకు చేరిన హనుమకొండ జెడ్పీ భవనం స్థానంలో ఆధునిక వసతులతో నూతన భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన నిధుల మంజూరు విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
వచ్చే నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో చారిత్రక ఆర్ట్స్ కాలేజీతో పాటు కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు కేటాయించేలా కృషి చేస్తానన్నారు.
వరంగల్ నగరానికి ఉన్న విద్యా, సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యతను పెంచేలా మౌలిక వసతుల కల్పనకు నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ.వి. శ్రీనివాస్ రావుతో పాటు పలువురు ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


