హనుమకొండ | ఏప్రిల్ 13, 2026
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 18 వరకు నిర్వహిస్తున్న రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి కలెక్టరేట్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే గోడపత్రాలు, కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.
అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ప్రమాదకర అలవాట్లను పూర్తిగా నివారించాలని హెచ్చరించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగకరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖాధికారి వేనుగోపాల్, సీనియర్ మోటార్ వాహనాధికారి రమేష్ రాథోడ్, ఆర్ & బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ బాబు, మోటార్ వాహనాధికారి కిషోర్ బాబు, ఉదయకీర్తి తదితరులు పాల్గొన్నారు.


