హనుమకొండ: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వయోవృద్ధులు సమాజానికి, కుటుంబానికి దిక్సూచి లాంటివారని కొనియాడారు. జీవితాంతం కుటుంబం, సమాజ పురోగతి కోసం నిరంతరం శ్రమించిన పెద్దలను బాధ్యతగా, ప్రేమతో చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. వృద్ధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహించినా, ఇబ్బందులకు గురిచేసినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలో వృద్ధుల సంక్షేమం కోసం 281 వృద్ధుల సంఘాలు, 3 డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి సేవలందిస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత సంక్షేమ శాఖ అధికారులు, వయోవృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


