వడదెబ్బతో మరణిస్తే రూ.4 లక్షల పరిహారం.. అర్హతలు, నిబంధనలు పూర్తి వివరాలు :
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ కారణంగా జరిగే మరణాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకృతి విపత్తుగా గుర్తించింది. దీంతో వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం CMRF నిధుల ద్వారా రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తోంది. గతంలో ఈ పరిహారం కేవలం రూ.50 వేలకే పరిమితమైంది.
24 గంటల్లో అధికారులకు సమాచారం :
వడదెబ్బతో మరణం సంభవించిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్, రెవెన్యూ అధికారులు (ఎంఆర్వో/వీఆర్వో), అలాగే వైద్య శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. పోలీస్ కేసు నమోదు సమయంలో మరణానికి కారణం వడదెబ్బేనని స్పష్టంగా నమోదు చేయించడం అవసరం.
పోస్టుమార్టం తప్పనిసరి :
పరిహారం పొందాలంటే ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించాలి. మరణానికి ప్రధాన కారణం “హీట్ స్ట్రోక్” లేదా “సన్ స్ట్రోక్” అని పోస్టుమార్టం నివేదికలో స్పష్టంగా పేర్కొనాలి. ప్రైవేట్ ఆసుపత్రుల నివేదికలు మాత్రమే సరిపోవు.
అవసరమైన పత్రాలు :
మరణ ధృవీకరణ పత్రం, పోస్టుమార్టం రిపోర్టు, పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీ, మృతుడి గుర్తింపు కార్డులు, కుటుంబ సభ్యుల ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఎంఆర్వో మరియు వైద్యాధికారుల ధృవీకరణ పత్రాలను సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ :
అన్ని పత్రాలతో తహసీల్దార్ లేదా ఎంఆర్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు విచారణ అనంతరం జిల్లా కలెక్టర్కు నివేదిక పంపిస్తారు. ఆమోదం లభించిన తర్వాత పరిహారం నేరుగా వారసుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
పరిహారం తిరస్కరణకు కారణాలు :
పోస్టుమార్టం చేయించకపోవడం, ఎఫ్ఐఆర్లో వడదెబ్బ ప్రస్తావన లేకపోవడం, మరణ కారణాన్ని నిరూపించలేకపోవడం లేదా మద్యం సేవించినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలితే పరిహారం మంజూరు కాకపోవచ్చు.
అందువల్ల వడదెబ్బ మరణం సంభవించినప్పుడు వెంటనే పోలీసులకు, వైద్య అధికారులకు సమాచారం ఇవ్వడం ద్వారా పరిహారం పొందే అవకాశాలు మెరుగుపడతాయి.


