హన్మకొండ: ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి హన్మకొండ కోర్టు కఠిన శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇన్‌స్పెక్టర్ కిషన్ వెల్లడించారు.
మడికొండ టేకులగూడెనికి చెందిన రఫీ (ఆకాష్) అనే వ్యక్తి, ప్రేమ పేరుతో ఓ బాలికను నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ జరిపి, నిందితుడిపై నేరాభియోగాలు నిరూపించారు.
హన్మకొండ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బి. అపర్ణాదేవి ఈ కేసులో సంచలన తీర్పును వెలువరించారు. నిందితుడు రఫీకి 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జైలు శిక్షతో పాటు రూ. 14 వేల జరిమానా కూడా విధించారు. బాధిత బాలికకు రూ. 2 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
నేరస్తులకు ఇటువంటి కఠిన శిక్షలు పడటం వల్ల సమాజంలో మార్పు వస్తుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు.


