ములుగు: రామప్ప ఆలయానికి వెళ్లిన ఓ యువకుడు ములుగు సమీపంలోని హోటల్‌లో భోజనం చేసిన అనంతరం అకస్మాత్తుగా కుప్పకూలి మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్నేహితురాలితో కలిసి రామప్ప ఆలయానికి:
వరంగల్ దేశాయిపేటకు చెందిన పేరాల నాగ సుక్రు (22) తన స్నేహితురాలితో కలిసి ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయానికి వెళ్లాడు. ఆలయంలో దైవదర్శనం అనంతరం ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు.
హోటల్ బయటే కుప్పకూలిన యువకుడు:
ములుగు సమీపంలోని వారాహి హోటల్‌లో ఇద్దరూ భోజనం చేశారు. భోజనం అనంతరం హోటల్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే సుక్రు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడున్న స్థానికులు వెంటనే స్పందించి అతడిని ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువకుడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఫుడ్ పాయిజన్ కోణంలో దర్యాప్తు:
ఘటనపై సమాచారం అందుకున్న ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వారాహి హోటల్‌ను తనిఖీ చేశారు. యువకుడి మృతికి హోటల్‌లో తీసుకున్న ఆహారం కారణమా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఆహార నమూనాలను పరిశీలించడంతో పాటు ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. యువకుడి మృతికి అసలు కారణం దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.


