వరంగల్: వరంగల్‌లో బీఆర్ఎస్ అక్రమాల చిట్టా అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (KUDA) భూముల వేలంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వరంగల్ భద్రకాళి దేవాలయంలో శుక్రవారం తడిబట్టలతో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో ఘాటుగా మాట్లాడారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.కోట్ల అక్రమాలను, భూదందాలను భద్రకాళి అమ్మవారి సాక్షిగా నిలదీస్తూ, నాటి పాలకుల 10 ఏళ్ల అన్యాయాల చిట్టా త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు.
నిజాయితీ ఉంటే వినయ్ భాస్కర్‌ను ఎందుకు తీసుకురాలేదు?
“మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి గారూ.. ఆరోపణలు చేసేటప్పుడు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను వెంటబెట్టుకుని రా అని సవాల్ విసిరితే ఎందుకు తీసుకురాలేదు? మీలో నిజాయితీ ఉంటే ఆయనను ఎందుకు పక్కన పెట్టారు?” అని ఇనగాల ప్రశ్నించారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో కుడా నిధుల దుర్వినియోగం, వెంచర్ల పేరిట చేసిన అక్రమ సంపాదనపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ ప్రారంభమైందని, మర్రి యాదవరెడ్డి, వినయ్ భాస్కర్‌లపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు.
కాళోజీ కళాక్షేత్రం, భద్రకాళి బండ్ కాంట్రాక్టులపై విచారణ
ప్రముఖ కవి కాళోజీ కళాక్షేత్రం టెండర్ల వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని చైర్మన్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన సదరు కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నట్లు ప్రకటించారు. అలాగే, ప్రతిష్టాత్మకమైన భద్రకాళి బండ్ కాంట్రాక్ట్‌ను గతంలో ‘సుచిర్ ఇండియా’ సంస్థకు ఏ విధంగా కట్టబెట్టారు, నిబంధనలను ఎలా తుంగలో తొక్కారు అనే అంశంపై కూడా పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారుల ముసుగులు త్వరలోనే తొలగిపోతాయని పేర్కొన్నారు.
రూ. 150 కోట్ల ల్యాండ్ కబ్జా.. జీఓ 59 దుర్వినియోగం
బాలసముద్రంలో అత్యంత విలువైన రూ. 150 కోట్ల కుడా భూమిని బీఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా కబ్జా చేసి, అక్కడ తమ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారని ఇనగాల ధ్వజమెత్తారు. “ప్రభుత్వ ఆస్తులను దోచుకున్న చరిత్ర మీది” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీల పేరుతో 59 జీఓను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ భూములను గులాబీ నేతలు తమ పేర్ల మీదకు మార్చుకున్న వ్యవహారంపై కూడా విజిలెన్స్ విచారణ వేగవంతం అయిందని చెప్పారు.
మాది పారదర్శక వేలం.. మీ హయాంలో ఆ ధైర్యం ఉందా?
గతంలో బీఆర్ఎస్ నేతలు వద్దని వదిలేసిన ప్లాట్లను వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, తాను కలిసి సరైన మార్కెటింగ్ చేసి, అత్యంత పారదర్శకంగా ఓపెన్ ఆక్షన్ (బహిరంగ వేలం) నిర్వహించి కుడా సంస్థకు భారీ లాభాలు తెచ్చిపెట్టామని ఇనగాల వివరించారు. వేలంలో పాల్గొన్న వారి పేర్లు, ఫోన్ నంబర్లు అన్నీ రికార్డుల్లో భద్రంగా ఉన్నాయని, ఎవరైనా సరిచూసుకోవచ్చని తెలిపారు. “మీ 10 సంవత్సరాల పాలనలో ఏ రోజైనా ఇలా బహిరంగ వేలంలో ప్లాట్లు అమ్మిన ధైర్యం మీకు ఉందా?” అని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
నగరాభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం
తాము హనుమకొండ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్షాలు చిల్లర మాటలతో అడ్డుపడుతున్నాయని మండిపడ్డారు. ఆర్టీసీ ట్రేడింగ్ సెంటర్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను గతంలో ఎంతకు లీజుకు ఇచ్చారో, వాటి వెనుక ఎన్ని కోట్లు దండుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు వరంగల్‌ను దోచుకుంటే.. తాము భద్రకాళి మాడ వీధుల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు. దేవుడి సాక్షిగా చెబుతున్నా.. తప్పుడు ఆరోపణలు చేసే ప్రతి అక్రమార్కుడికి చట్టపరంగా శిక్ష పడటం ఖాయమని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి స్పష్టం చేశారు.
మొత్తంగా బీఆర్ఎస్ అక్రమాల చిట్టా అంశం తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి పెంచే అవకాశముంది.
Read Warangal News and Latest Politics News and Real Estate

