హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి పథం’ కార్యక్రమంలో భాగంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. అర్హులైన పేదలకు సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది.
హన్మకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి కలిసి లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందని, రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని పేర్కొన్నారు.
ప్రజల వద్దకే పాలనను తీసుకువెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల రాజ్యమని వారు వివరించారు.
ఈ పంపిణీ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తమకు ఇళ్ల పట్టాలు అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


