పోలీస్ ఇన్‌స్పెక్టర్ కుమార్తె సత్తా.. ఐఐటీ ముంబైలో సీటు కొట్టేసిన సాత్విక:
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది తమ ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడమే కాకుండా, పిల్లల విద్యాాభివృద్ధి మరియు భవిష్యత్తుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. విద్యారంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచి ప్రతిష్ఠాత్మక ఐఐటీ ముంబైలో ప్రవేశం పొందిన విద్యార్థిని యడ్లపల్లి సాత్వికను ఆయన ఘనంగా సత్కరించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న యడ్లపల్లి సతీష్ కుమార్తె సాత్విక జేఈఈ మెయిన్స్ పరీక్షలో 99.65 పర్సంటైల్ సాధించి ప్రతిభ చాటుకుంది. అనంతరం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో 8808వ ర్యాంకు సాధించి, దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ ముంబైలో సివిల్ ఇంజినీరింగ్ కోర్సులో సీటు దక్కించుకుంది.
ఈ సందర్భంగా సాత్వికను తన కార్యాలయంలో అభినందించిన సీపీ సన్‌ప్రీత్ సింగ్, ఆమె సాధించిన విజయాన్ని ప్రశంసించారు. ఐఐటీలో ప్రవేశం పొందడం గొప్ప విజయమని, ఇకపై కూడా అదే పట్టుదలతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.
పోలీసు శాఖలో పనిచేసే సిబ్బంది నిరంతరం విధుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, వారి పిల్లలు విద్యారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధించడం ఆనందకర విషయమని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి విజయాలు ఇతర విద్యార్థులకు సైతం స్ఫూర్తిగా నిలుస్తాయని, కష్టపడి చదివితే ఏ లక్ష్యమైనా సాధించవచ్చని సీపీ అన్నారు. సాత్విక భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


