ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మందులు, వైద్యుల ఫీజులతో పాటు వివిధ మెడికల్ కన్స్యూమబుల్స్ పేరుతోనూ రోగులకు భారీగా బిల్లులు వస్తుంటాయి. అయితే కొన్ని వైద్య పరికరాల కొనుగోలు ధరకు, వాటిపై ముద్రించిన గరిష్ఠ చిల్లర ధరకు (MRP) మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) చీఫ్ తుకారాం ముండే వెల్లడించారు.
రూ.11 ఐవీ సెట్.. రూ.325 MRP :
మహారాష్ట్రలో నిర్వహించిన ఓ సర్వే వివరాలను తుకారాం ముండే సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో ఐవీ ఇన్ఫ్యూషన్ సెట్ ట్రేడ్ ధర కేవలం రూ.11.05గా ఉండగా, అదే ఉత్పత్తిపై రూ.325 MRP ముద్రించినట్లు గుర్తించారు. అంటే ట్రేడ్ ధరతో పోలిస్తే MRPలో దాదాపు 2,841 శాతం వరకు మార్క్‌అప్ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదే సర్వేలో రూ.6.75కు కొనుగోలు చేసిన ఓ ఇంజెక్షన్ సిరంజిపై రూ.57.20 MRP ఉన్నట్లు గుర్తించారు. అలాగే రూ.29.41కు కొనుగోలు చేసిన క్యాథెటర్‌పై రూ.310 MRP ముద్రించినట్లు వెల్లడైంది.
రోగులకు ధరలపై సమాచారం అంతంతే :
చికిత్స సమయంలో ఉపయోగించే ప్రతి మెడికల్ వస్తువు అసలు కొనుగోలు ధర ఎంత? దానిపై ఎంత MRP ఉంది? అనే విషయాలు రోగులకు సాధారణంగా తెలియవు. దీంతో బిల్లులోని ఛార్జీలను అర్థం చేసుకోవడం కష్టమవుతోంది. ఈ సమాచార లోపం ప్రజారోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన అంశమని ముండే అభిప్రాయపడ్డారు.
పరికరాల ధరలపై నియంత్రణ అవసరం :
తయారీదారులు, పంపిణీదారుల స్థాయిలోనే కొన్ని ఉత్పత్తులకు MRP నిర్ణయిస్తారని ముండే తెలిపారు. షెడ్యూల్డ్ మందులకు డ్రగ్స్ (ప్రైసెస్ కంట్రోల్) ఆర్డర్, 2013 కింద ధరల నియంత్రణ ఉన్నప్పటికీ, అనేక మెడికల్ పరికరాలు, కన్స్యూమబుల్స్ విషయంలో ఇలాంటి నియంత్రణలు పరిమితంగా ఉన్నాయి.
స్పష్టమైన మార్గదర్శకాలకు సిఫారసు :
ట్రేడ్ ధర, MRP మధ్య అనుమతించదగిన వ్యత్యాసంపై స్పష్టమైన మార్గదర్శకాలు అవసరమని ముండే సూచించారు. ఈ అంశంపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA)కి సిఫారసులు పంపినట్లు తెలిపారు. ఇలాంటి చర్యల ద్వారా మెడికల్ వస్తువుల ధరల్లో పారదర్శకత పెరగడంతో పాటు రోగులకు అందే సమాచారం మెరుగుపడే అవకాశం ఉంది.


