జనగామ: ఒంటరిగా పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడును అపహరించేందుకు యత్నించిన ఇద్దరు నిందితులను లింగాల ఘనపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 28న జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామ శివారులోని పత్తి చేనులో పనిచేస్తున్న మహిళను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్‌లోని చైతన్యపురికి చెందిన గోకారపు ఉపేందర్ (35), పాలమాకుల విష్ణు (20) చైన్ స్నాచింగ్‌కు యత్నించారు.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పల్సర్ RS200 బైక్‌పై జనగామకు చేరుకున్న నిందితులు, గ్రామ పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలో పత్తి చేనులో పనిచేస్తున్న మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కునేందుకు ప్రయత్నించగా, ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు.
సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఉపేందర్ వద్ద నుంచి నల్లరంగు వన్‌ప్లస్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు ఉపయోగించిన పల్సర్ RS200 బైక్‌ను కూడా గుర్తించారు.
కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన ఎస్సై కిషోర్, ఏఓ సల్మాన్ పాషా, కానిస్టేబుళ్లు అనుదీప్, వేణుగోపాల్‌లను సీఐ జి.వేణు అభినందించారు.
పోలీసుల సూచన: గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో పనిచేసే మహిళలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.


