కేంద్రంపై కడియం కావ్య ఫైర్.. పార్లమెంట్‌లో బిల్లుల ఆమోదంపై విమర్శలు:
జనగామ: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు క్రమంగా పెరుగుతోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజలే తగిన సమాధానం చెబుతారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా, పట్టణ, మండల, అనుబంధ సంఘాల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ కడియం కావ్య నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
కేంద్రంపై కడియం కావ్య విమర్శలు :
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్నారు. పేద విద్యార్థుల సమస్యలు, పేపర్ లీకేజీలు వంటి అంశాలపై ఆయన ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్‌లో కీలక బిల్లులను ఎంపీల అభిప్రాయాలు, ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండానే వేగంగా ఆమోదిస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ వెనుక రాజకీయ ప్రయోజనాల ఉద్దేశం ఉందని ఆరోపించిన ఆమె.. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును ఎవరూ ప్రభావితం చేయలేరన్నారు. బీజేపీ పతనం ప్రజల చేతుల్లోనే ఖాయమని వ్యాఖ్యానించారు.
అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి:
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సుమారు రూ.6,500 కోట్ల నిధులు కేటాయించారని కడియం కావ్య తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీలో గ్రూపు రాజకీయాలకు తావులేకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలని, కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. నూతన కార్యవర్గాలు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాంబాబు, వైటీడీఏ బోర్డు సభ్యుడు లక్ష్మీనారాయణ నాయక్, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, మండల అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


