మానసిక దివ్యాంగుల సంక్షేమం మరియు వారి హక్కుల రక్షణే ధ్యేయంగా పార్లమెంట్‌లో పోరాడుతానని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యం స్పష్టం చేశారు. హన్మకొండ బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో నిర్వహించిన ఉగాది సంబరాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఆమె దివ్యాంగులతో సమయాన్ని గడిపారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సమాజంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా వారి భద్రత, ఆర్థిక స్వాలంబన మరియు సామాజిక గౌరవం కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. దివ్యాంగుల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేలా పార్లమెంట్ సాక్షిగా గళం వినిపిస్తానని ఆమె హామీ ఇచ్చారు. పండుగ పూట చిన్నారుల మధ్య గడపడం సంతోషంగా ఉందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.


