హనుమకొండ | తేదీ: 05-04-2026
హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య, బాబు జగ్జీవన్ రామ్ దేశ నిర్మాణంలో విశిష్ట పాత్ర పోషించిన మహనీయుడని కొనియాడారు. సామాజిక సమానత్వం, పేదల సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.

అలాగే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే దళిత వర్గాలకు సమాన అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన అవకాశాల ద్వారానే తాను దళిత బిడ్డగా పార్లమెంట్ స్థాయికి ఎదగగలిగానని తెలిపారు.
దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమాజం మరింత చైతన్యంతో ముందుకు రావాలని, ముఖ్యంగా విద్యా రంగంలో ప్రభుత్వ మరియు కార్పొరేట్ పాఠశాలల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని సూచించారు. దళిత మేధావులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని పిలుపునిచ్చారు.
ఎస్సీ వర్గాలు ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. వచ్చే ఏడాదిలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఎంఆర్‌పీఎస్ నాయకులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


