రైజ్ హర్-2026′ సదస్సులో కడియం కావ్య కీలక ప్రసంగం.. మహిళలకు పలు సూచనలు:
మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హైదరాబాద్‌లోని రెడ్ హిల్స్‌లో తెలంగాణ ఎస్సీ/ఎస్టీ ఇండస్ట్రియల్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TSICC) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైజ్ హర్–2026’ మహిళా సాధికారత సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

మహిళలకు సమాన అవకాశాలు అవసరం:
ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ, మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన, నాయకత్వ వికాసానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు 50 శాతం రిజర్వేషన్లు అమలు కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళలు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు.

సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ప్రోత్సాహం:
రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేస్తూ మహిళల్లో పొదుపు, స్వయం ఉపాధి, పారిశ్రామిక రంగంలో అభివృద్ధిని ప్రోత్సహిస్తోందని ఆమె పేర్కొన్నారు. మహిళలు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే కుటుంబంతో పాటు సమాజం, రాష్ట్ర అభివృద్ధికి కూడా కీలకంగా దోహదపడతారని చెప్పారు.

విద్య, నాయకత్వంలో ముందుండాలి:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన ‘పే బ్యాక్ టు సొసైటీ’ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని ఎంపీ పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షిస్తూ జాతీయ గౌరవాన్ని పెంపొందించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్సీ మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, నాయకత్వ రంగాల్లో మరింత ముందుకు వచ్చి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. జీవితాంతం నేర్చుకుంటూ నిత్య విద్యార్థులుగా ఎదగాలని యువతకు సందేశం ఇచ్చారు. సదస్సులో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్, వి-హబ్ డైరెక్టర్ జావేద్ అక్తర్ షేక్, టీఎస్ఐసీసీ అధ్యక్షుడు నల్ల బాబు తదితరులు పాల్గొన్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


