స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం, ఫిబ్రవరి 19, 2026:
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బిఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
బిఆర్ఎస్ నాయకులు అధికారాన్ని కుటుంబ హక్కుగా భావిస్తూ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
విపరీతమైన ధోరణితో నీచమైన విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
అయితే ప్రజలు ఆ విమర్శలను పట్టించుకోవడం లేదని, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.
భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి, అక్రమాల కారణంగా ప్రజలు ఆ పార్టీకి దూరమవుతున్నారని వ్యాఖ్యానించారు. 2014కు ముందు కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు ఎంత? ప్రస్తుతం ఎంత ఉన్నాయో ప్రజల ముందు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
జాతిపిత అంశంపై కూడా కడియం శ్రీహరి స్పందిస్తూ, దేశానికి జాతిపిత ఒక్కరే ఉన్నారని, ఆయనే మహాత్మా గాంధీ అని స్పష్టం చేశారు.
జాతిపిత అని స్వయంగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
కేసుల విషయంలో మాట్లాడుతూ, కల్వకుంట్ల కుటుంబంలోని ప్రతి ఒక్కరూ వివిధ కేసుల్లో ఇరుక్కున్నారని ఆరోపించారు. తమపై కేసులు నమోదైతే తెలంగాణను అవమానిస్తున్నారని చెప్పడం తగదని ప్రశ్నించారు. “తెలంగాణ ఎవరి సొత్తు కాదు” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ఎన్ని రోజులు రాజకీయాలకు వాడుకుంటారని ప్రశ్నించారు.
ప్రజలు తమ అహంకారం, మాట తీరు మార్చుకోకపోవడం వల్లే బిఆర్ఎస్‌కు దూరమవుతున్నారని అన్నారు.
అభివృద్ధే లక్ష్యం
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని కడియం శ్రీహరి తెలిపారు.
ఇటీవల ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలని సూచించారు.
ప్రజల నుండి రూపాయి ఆశించకుండా పారదర్శకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
“మనందరం కలిసి అవినీతి రహిత, అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా స్టేషన్ ఘనపూర్‌ను తీర్చిదిద్దుదాం” అని ఆయన అన్నారు.


