ఉమ్మడి వరంగల్ రైతులకు ఊరట.. ధాన్యం కొనుగోళ్లపై కడియం శ్రీహరి కీలక సూచనలు:
హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొలుగోళ్లు, రవాణా ప్రక్రియపై జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు.

ఈ సమావేశంలో మాట్లాడిన కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని జనగామ జిల్లా ఐదు మండలాలలో ధాన్యం కొనుగోళ్లలో కొంత ఆలస్యం జరుగుతుందని వెల్లడించారు. ప్రతి మండలంలో సుమారు ఐదు నుంచి 6000 క్వింటాల ధాన్యం మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. రవాణా ప్రక్రియ నెమ్మదిగా సాగుతుందన్నారు. ఇప్పటివరకు సుమారు 80 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని మాత్రమే తరలించగలిగామని.. ఇంకా 30 వేల క్వింటాళ్లు మిగిలి ఉన్నాయని తెలిపారు.

అకాల వర్షాలు, అనుకూలంగా లేని వాతావరణ పరిస్థితిలో కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంటూ ధాన్యం కొనుగోలు మరియు రవాణా పనులను వేగవంతం చేయాలని మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి జూన్ 4వ తేదీ లోపు అన్ని ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి అని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా ఇసుక లారీలు, డీసీఎంలు సహా అందుబాటులో ఉన్న అన్ని రవాణా వాహనాలను వచ్చే వారం రోజులపాటు ధాన్యం తరలింపుకే వినియోగించాలని అధికారులు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు రవాణా ప్రక్రియను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.


