లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీరుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా బిల్లు విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని మరోసారి స్పష్టమైందని ఆమె విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడను ఎండగట్టారు.
ప్రతిపక్షాలు అడ్డుకుంటాయని తెలిసినప్పటికీ, బీజేపీ కావాలనే మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుతో ముడిపెట్టిందని కవిత ఆరోపించారు. ఈ రెండింటిని కలిపి పార్లమెంటు ముందుకు తీసుకురావడం వెనుక కుట్ర దాగి ఉందని, దీనివల్లే ప్రతిపక్షాలన్నీ ఏకమై బిల్లును వ్యతిరేకించాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తద్వారా లోక్‌సభలో బిల్లు వీగిపోయేలా చేసి బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని మండిపడ్డారు.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సమయంలోనే మహిళా బిల్లును ఆర్భాటంగా పాస్ చేసి, దానిని జనగణన (సెన్సెస్)కు లింక్ చేశారని కవిత గుర్తు చేశారు. “గతంలో ఒక మాట చెప్పి, ఇప్పుడు 2011 సెన్సెస్ ఆధారంగా బిల్లు ప్రవేశపెడుతున్నామని చెప్పడం మహిళలను మరోసారి వంచించడమే” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ చేస్తోన్న మోసపూరిత రాజకీయాలను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆడబిడ్డలు గమనించాలని కవిత పిలుపునిచ్చారు. మహిళా సాధికారతపై చిత్తశుద్ధి లేని పార్టీలను గుర్తించి, తగిన గుణపాఠం చెప్పాలని ఆమె కోరారు.


