కాజీపేట రైల్వే డివిజన్ కోసం పోరాటం కొనసాగిస్తాం..దాస్యం వినయ్ భాస్కర్:
కాజీపేట రైల్వే డివిజన్ సాధనతో పాటు తెలంగాణ హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 30న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు తరలివెళ్తున్న పార్టీ శ్రేణులకు మంగళవారం ఉదయం కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఆయన సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. పోరాటాలే తమ పంథా అని, ప్రజల హక్కుల సాధన కోసం ఎప్పటికప్పుడు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాట స్ఫూర్తితోనే రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం ముందుకు సాగుతామని తెలిపారు.
రైల్వే అభివృద్ధి కోసం ఉద్యమం:
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల నాలుగు దశాబ్దాల కల అయిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం బీఆర్ఎస్ పోరాడిందని వినయ్ భాస్కర్ గుర్తు చేశారు. ప్రస్తుతం సాధించిన కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.అలాగే కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు, భూములు ఇచ్చిన బాధితులకు ఉపాధి అవకాశాలు, లోకో పైలట్ పోస్టుల భర్తీ, పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పూర్తి కోసం ఢిల్లీలో శాంతియుత ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సంకు నర్సింగరావు, బొంగు అశోక్ యాదవ్, జోరిక రమేష్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


