కాజీపేట: వాహనదారులు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించినప్పుడే రహదారి భద్రత సాధ్యమవుతుందని కాజీపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న పేర్కొన్నారు. మంగళవారం కాజీపేట రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ వద్ద డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
తోటి వాహనదారులకు, పాదచారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాహనాలను నిర్ణీత స్థలాల్లోనే నిలపాలని సూచించారు. ఆటోల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం ప్రమాదకరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రైవర్లు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ రహదారి నియమాలను గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొని డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.


