ఖమ్మం జిల్లాలో ఘోర కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. సాధారణ జలుబు, దగ్గుకు వైద్యం చేయించుకోవడానికి వెళ్లిన ఓ పాఠశాల విద్యార్థిని, RMP డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సంఘటన వివరాలు:
కస్తూరిబా పాఠశాలలో చదువుతున్న హేమశ్రీ (14) అనే విద్యార్థిని బోనాల పండుగ సందర్భంగా తన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా బస్వాపురానికి వచ్చింది. పండుగ పూర్తయిన తర్వాత ఆమెకు సాధారణ జలుబు, దగ్గు రావడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం స్థానిక RMP డాక్టర్ సంపత్ వద్దకు తీసుకెళ్లారు.
బాధితురాలికి సంపత్ ఒక ఇన్జెక్షన్ వేయగానే, హేమశ్రీ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే ఆమెను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి చేరుకునేసరికే బాలిక మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
మద్యం మత్తులో వైద్యం.. ఆర్ఎంపి పరార్:
వైద్యం అందించే సమయంలో RMP సంపత్ తీవ్ర మద్యం మత్తులో ఉన్నాడని, అతని నిర్లక్ష్యపూరిత వైఖరి మరియు తప్పుడు ఇన్జెక్షన్ వల్లనే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని హేమశ్రీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా ఆరోపిస్తున్నారు. బాలిక మృతి చెందినంతరం RMP డాక్టర్ సంపత్ ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న RMP సంపత్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

