కొండా దంపతులు కాంగ్రెస్‌ను వీడతారంటూ వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కొండా మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు శాశ్వతం కాదని, కార్యకర్తలే తమ బలమని స్పష్టం చేస్తూనే.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని తేల్చిచెప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ రాజకీయాలపై కీలక ప్రకటనలు చేయడంతో పాటు, తనపై వచ్చిన ఆరోపణలపై కూడా ఆయన సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలు, వరంగల్ తూర్పు భవిష్యత్ రాజకీయాలపై కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
పదవులు ఉంటాయి.. పోతాయి :
పదవులు శాశ్వతం కాదని, పదవి ఉంటే ఉంటుందని.. పోతే పోతుందని కొండా మురళీ అన్నారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనూ కార్యకర్తలకు ‘సారీ’ చెప్పాల్సిన పరిస్థితి తనకు రాలేదన్నారు. మాటకు కట్టుబడి ఉండాలని, కృతజ్ఞత అనేది తమ రక్తంలోనే ఉందని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం :
కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని మురళీ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ లక్ష్యమన్నారు. పార్టీలో ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడవద్దని కార్యకర్తలకు సూచించారు. అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు.
కార్యకర్తలే నా బలం :
తనను నమ్ముకొని ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారని మురళీ అన్నారు. కార్యకర్తల కోసం అవసరమైతే మరో పది ఎకరాల భూమిని కూడా అమ్ముతానని వ్యాఖ్యానించారు. కార్యకర్తలే తన బలమని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే వారికి, గెలిచే సత్తా ఉన్నవారికే కార్పొరేటర్ టికెట్లు దక్కుతాయని చెప్పారు.
వరంగల్ తూర్పుపై కీలక ప్రకటన :
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 24 మంది కార్పొరేటర్లను గెలిపిస్తానని కొండా మురళీ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ బాధ్యతలను నవీన్ రాజ్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. తనకు, తన కుమార్తె సుస్మితకు రాజకీయంగా సంబంధం లేదని అన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలపై సవాల్ :
కొండా మురళీ కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. తనకు నాలుగు బుల్లెట్లు ఇంకా శరీరంలో ఉన్నాయని, కార్యకర్తల ఆశీస్సులే తనను బతికిస్తున్నాయని అన్నారు. ఢిల్లీ రావాలని తనకు ఫోన్ వచ్చిన మాట వాస్తవమేనని వెల్లడించారు. తన కారుకు ఉన్న రంగు ప్రత్యేకమైనదని, అది ముస్లింలకు చిహ్నంగా ఉంటుందని పేర్కొన్నారు.


