తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం ఇంకా చర్చనీయాంశంగా కొనసాగుతోంది. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీల నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వేళ.. బీజేపీ ఎంపీ డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం తనను తీవ్రంగా బాధించిందని ఆమె పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలే కారణమా? :
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలే కొండా సురేఖ బర్తరఫ్కు కారణమయ్యాయని డీకే అరుణ ఆరోపించారు. పార్టీలోని పరిణామాల కారణంగా సీనియర్ మహిళా నాయకురాలైన సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం బాధాకరమని ఆమె అన్నారు.
గత అనుబంధాన్ని గుర్తుచేసుకున్న అరుణ :
శుక్రవారం జడ్చర్ల, బాలానగర్ మండలాల్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డీకే అరుణ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొండా సురేఖ తనకు సీనియర్ మహిళా నాయకురాలని చెప్పారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో తామిద్దరూ కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు.
ఆ సమయంలో సురేఖతో కలిసి మంత్రిగా పనిచేయడం సంతోషంగా అనిపించిందని డీకే అరుణ అన్నారు. తెలంగాణకు తోటి మహిళా నాయకురాలు మంత్రిగా సేవలందించడం గర్వకారణంగా భావించానని పేర్కొన్నారు. అలాంటి నాయకురాలిని ఇప్పుడు మంత్రివర్గం నుంచి తొలగించడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలు కాంగ్రెస్‌లోని అంతర్గత రాజకీయాలను మరోసారి తెరపైకి తెచ్చాయని డీకే అరుణ అభిప్రాయపడ్డారు.


