కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంపై ఆమె కుమార్తె కొండా సుష్మిత తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేస్తూ సుష్మిత మీడియా ముందర భోరున ఏడ్చారు. నేను మాట్లాడిన మాటలకు నా తల్లిని బలి చేస్తారా అని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
అసలు నా తల్లి ఏం తప్పు చేసింది?
మా అమ్మ ఏ రకమైన తప్పూ చేయలేదని, తన శాఖలో చిన్నపాటి అవినీతి కూడా జరగలేదని సుష్మిత స్పష్టం చేశారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన ఒక మహిళపై సీఎం రేవంత్ రెడ్డి ఇంత పగ పెంచుకుంటారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. “ఒక ఆడబిడ్డ ఉసురు ఊరికే పోదు” అని ఆమె వ్యాఖ్యానించారు.
జైల్లో వేస్తే నన్ను వేయాలి
“నేను మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదు. ఒకవేళ తప్పు ఉంటే అది నాది మాత్రమే. నాపై అక్రమ కేసులు పెట్టి నన్ను జైల్లో వేయాల్సింది కానీ, మా అమ్మను బలి చేయడం ఏంటి? అమ్మా, నాన్నా నన్ను క్షమించండి. నా వల్ల మీకు ఈ అవమానం జరిగింది” అంటూ సుష్మిత కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను పార్టీని ఎక్కడా కించపరచలేదని, కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయాలపై మాత్రమే మాట్లాడానని తేల్చిచెప్పారు.
అధిష్ఠానాన్ని బ్లాక్మెయిల్ చేశారు..
కాంగ్రెస్ అధిష్ఠానం మొత్తం మా అమ్మకే మద్దతుగా నిలిచిందని, అయితే “పార్టీలో నేనైనా ఉండాలి, ఆమె అయినా ఉండాలి” అనే స్థాయికి సీఎం దిగజారి అధిష్ఠానాన్ని బ్లాక్మెయిల్ చేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుల అక్రమాల చిట్టా తన వద్ద ఉందని, దాని గురించి త్వరలోనే మాట్లాడుతానని హెచ్చరించారు.
పార్టీలోనే కొనసాగుతాం..
రేవంత్ రెడ్డి మీడియా కావాలనే తన తల్లి స్థాయిని తగ్గించి చూపిస్తోందని సుష్మిత విమర్శించారు. ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్న తన తండ్రి గానీ, మంత్రిగా ఉన్న తన తల్లి గానీ సీఎంను తిట్టమని తనకు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎంత అవమానం జరిగినప్పటికీ తన తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని ఆమె స్పష్టం చేశారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


