దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ యూజీ (NEET UG) 2026 పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం వల్లే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు తాజాగా ‘ఎక్స్’ (X) వేదికగా కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
నీట్ ప్రశ్నాపత్రం లీకై ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని కేటీఆర్ విమర్శించారు. “పగలూ రాత్రి కష్టపడి చదివిన ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోంది. 2024లో జరిగిన లీకేజీ ఘటనల నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఈ పరిస్థితి పునరావృతమైంది. జాతీయ స్థాయి అర్హత పరీక్షల నిర్వహణలో వరుసగా వెలుగుచూస్తున్న ఈ అసమర్థత విద్యార్థుల పట్ల శాపంగా మారింది,” అని ఆయన పేర్కొన్నారు.
వ్యవస్థలో దారుణమైన లోపాలు
పరీక్షకు ఒకరోజు ముందే ఏకంగా వందకు పైగా ప్రశ్నలు లీక్ కావడం వ్యవస్థలోని లొసుగులను బయటపెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఏడాది నీట్ పరీక్ష రాసిన సుమారు 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రస్తుతం తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేటీఆర్ డిమాండ్లు ఇవే:
• లీకేజీ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని వెంటనే ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి.
• ఈ కుంభకోణం వెనుక ఎంతటి వారున్నా వదలకుండా కఠినంగా శిక్షించాలి.
• విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చినందుకు కేంద్ర ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
• సాధ్యమైనంత త్వరగా అత్యంత పారదర్శకంగా మళ్లీ నీట్ పరీక్షను నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలి.


