హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘ కాలంగా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేద కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించవద్దని వామపక్ష పార్టీల నేతలు కోరారు. ఈ మేరకు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని హన్మకొండలో కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా నిరుపేదలు ఆయా ప్రాంతాల్లో నివాసముంటున్నారని, ఇప్పుడు ఆ గుడిసెలను తొలగిస్తే వారు రోడ్డున పడే ప్రమాదం ఉందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసె వాసులందరికీ పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే వారి సంక్షేమం కోసం ప్రత్యేక ప్యాకేజీ లేదా ప్రత్యామ్నాయ మార్గాలను చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించి, పేదలకు అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు.


