లోక్ అదాలత్‌తో కేసులకు ఫుల్ స్టాప్:సీపీ సన్‌ప్రీత్ సింగ్ పిలుపు
వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ప్రజలను రెండవ జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 20వ తేదీ శనివారం నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్ సందర్భంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు రూపొందించిన అవగాహన వాల్ పోస్టర్లను ఆయన మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీపీ, రాజీ ద్వారా పరిష్కరించగలిగే వివిధ రకాల కేసులను లోక్ అదాలత్‌లో వేగంగా, సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి పంపకాల సమస్యలు, కుటుంబ కలహాలు, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు, చెక్ బౌన్స్ కేసులు వంటి అంశాలు లోక్ అదాలత్ పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు.
చిన్న చిన్న వివాదాలను పెద్దవిగా మార్చుకుని కోర్టుల చుట్టూ తిరగడం వల్ల సమయం, ధనం వృథా అవుతాయని సీపీ సూచించారు. పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా ఇరుపక్షాలకు ప్రయోజనం చేకూరుతుందని, అందుకే “రాజీయే రాజమార్గం” అని ఆయన అన్నారు.
జిల్లాలోని పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే సిబ్బంది రాజీకి అనువైన కేసులను గుర్తించి, సంబంధిత పక్షాలతో కౌన్సెలింగ్ నిర్వహించి అవగాహన కల్పిస్తారని తెలిపారు. తమ కేసులను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకునే వారు సమీప పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు.
లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందే అవకాశం ఉంటుందని సీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీ సత్యనారాయణతో పాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


