వడ్డేపల్లి చెరువుకు భారీ మేకోవర్.. పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ హెచ్చరిక :
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలోని దేశాయిపేట చిన్న వడ్డేపల్లి చెరువు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు. శనివారం చెరువు ప్రాంతాన్ని ప్రత్యక్షంగా సందర్శించిన ఆమె, అమృత్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.

చెరువు కట్ట బలోపేతం, విస్తరణతో పాటు చేపడుతున్న ఇతర మౌలిక సదుపాయాల పనులను కలెక్టర్ క్షుణ్ణంగా సమీక్షించారు. ముఖ్యంగా వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పనుల వేగాన్ని మరింత పెంచి, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. చెరువు బండ్ వెడల్పు పెంపు, బలోపేత పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని స్పష్టం చేశారు.

అభివృద్ధి పనులు పూర్తయితే చెరువు పరిసర ప్రాంతాల సౌందర్యం మెరుగుపడటంతో పాటు స్థానిక ప్రజలకు మెరుగైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. పనుల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.

ఇక వినాయక నిమజ్జనాల సమయంలో భక్తులకు రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. చెరువు పక్కన సీసీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి, త్వరగా అమలు ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుచరణ్, బల్దియా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోష్ బాబు, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, డీఈ ముజమ్మిల్‌తో పాటు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. చెరువు అభివృద్ధి పనులపై అధికారులు కలెక్టర్‌కు వివరాలు అందించారు.


