వరంగల్ మామునూర్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) విడుదల చేసిన తాజా నమూనా (లేఅవుట్)లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఎయిర్‌పోర్టుకు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏ దిశలో ఉంటాయనే అంశంపై చాలా కాలంగా నెలకొన్న సందిగ్ధతకు ఈ నమూనా ద్వారా తెరపడింది. ఎయిర్‌పోర్టు ప్రధాన ఎంట్రీ, ఎగ్జిట్లు వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఉన్న పోలీసు క్యాంపు సమీపంలోని తిమ్మాపూర్ క్రాస్ వద్ద ఏర్పాటు చేయనున్నట్లు మ్యాప్‌లో స్పష్టంగా చూపించారు.

తిమ్మాపూర్ క్రాస్ వద్ద ప్రధాన ప్రవేశ మార్గం:
ఏఏఐ రూపొందించిన ప్రణాళిక ప్రకారం ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించే ప్రధాన మార్గం తిమ్మాపూర్ క్రాస్ వైపు నుంచే ఉండనుంది. ఇదే ప్రాంతంలో ఎగ్జిట్ కూడా ఏర్పాటు చేయనుండటంతో రాకపోకలు సులభతరం కానున్నాయి. ఇప్పటికే వరంగల్–ఖమ్మం రహదారి ప్రధాన రవాణా మార్గంగా ఉండటంతో భవిష్యత్తులో ఎయిర్‌పోర్టుకు చేరుకునే ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా ఈ ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.

నక్కలపల్లి వైపు రన్‌వే ముగింపు:
లేఅవుట్లో మరో ముఖ్యమైన అంశం రన్‌వే నిర్మాణానికి సంబంధించినది. ఎయిర్‌పోర్టు రన్‌వే ముగింపు భాగం నక్కలపల్లి గ్రామం వైపు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో విమానాల టేకాఫ్, ల్యాండింగ్ కార్యకలాపాలు నిర్దేశిత దిశలో నిర్వహించే అవకాశముంది.
స్థానికుల్లో ఆసక్తి:
మామునూర్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో ఈ నమూనా విడుదలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలపై స్పష్టత రావడంతో స్థానిక ప్రజలు, వ్యాపార వర్గాలు, భూ యజమానులు ఆసక్తిగా ఈ ప్రాజెక్టు పురోగతిని గమనిస్తున్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయితే వరంగల్‌తో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అధికారులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


