చేనేత హక్కుల కోసం హనుమకొండలో భారీ ర్యాలీ..:
హనుమకొండ జిల్లాలో చేనేత కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేనేత రంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు, నేత కార్మిక సంఘాల ప్రతినిధులు ఏకశిలా పార్కు నుంచి వరంగల్ కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ..”చేనేత రంగం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. ముఖ్యంగా భౌగోళిక గుర్తింపు (GI) పొందిన వరంగల్ చేనేత ఉత్పత్తుల ప్రత్యేకతను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు మార్కెటింగ్, విక్రయ అవకాశాలను పెంచే విధానాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు”.
అలాగే, చేనేత కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ జీవో నెంబర్-1ను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో ద్వారా చేనేత కార్మికులకు అందుతున్న ప్రయోజనాలను కొనసాగించడం అవసరమని పేర్కొన్నారు. ఇటీవల అమలులోకి తీసుకొచ్చిన ఏకీకృత టెండర్ విధానం కారణంగా చిన్న స్థాయి చేనేత సహకార సంఘాలు, కార్మికులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఆ విధానాన్ని వెంటనే రద్దు చేసి, చేనేత రంగానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
Read Warangal News and Latest Politics News and Real Estate


