వరంగల్ జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యంగ్ అచీవర్స్ సన్మాన కార్యక్రమం’ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిథిగా హాజరై, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు.
పదవ తరగతి ఫలితాల్లో 550 కంటే ఎక్కువ మార్కులు, ఇంటర్మీడియట్ ఫలితాల్లో 980 పైగా మార్కులు సాధించి జిల్లా పేరు నిలబెట్టిన విద్యార్థులకు మంత్రి ప్రశంసా పత్రాలను అందజేశారు.
అతి చిన్న వయసులోనే అద్భుత ప్రతిభ కనబరిచి ప్రపంచ రికార్డులు సృష్టించిన కొండ శ్రీయాన్ష్ మురళీకృష్ణను మంత్రి ప్రత్యేకంగా అభినందించి, ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
విద్యార్థులను ప్రోత్సహించేలా సాగిన ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, కుడా (KUDA) చైర్మన్ ఇనుగుల రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారద, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


