వరంగల్: ఆసియాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌గా పేరుగాంచిన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను రాష్ట్ర కొండా సురేఖ శనివారం అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ సత్య శారద గారు కూడా పాల్గొన్నారు.
మార్కెట్‌కు వచ్చే రైతుల ఉత్పత్తుల రక్షణ కోసం, అక్రమాలను అరికట్టేందుకు ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మార్కెట్ యార్డులోని ప్రతి మూలను కవర్ చేసేలా అత్యాధునిక కెమెరాలను అమర్చారు. వీటిని కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. తూకాల్లో మోసాలు జరగకుండా, దొంగతనాలను అరికట్టేందుకు ఈ డిజిటల్ నిఘా ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సురేఖ తెలిపారు. మార్కెట్ అభివృద్ధికి మరిన్ని నిధులు వెచ్చించి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, రైతుల భరోసా కోసం టెక్నాలజీని వాడుకోవడం శుభపరిణామమని కొనియాడారు. కలెక్టర్ సత్య శారద గారు మాట్లాడుతూ, భద్రతతో పాటు మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.


