న్యూఢిల్లీ: పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిని, ఏర్పాటును తక్కువ చేస్తూ మాట్లాడటం అన్యాయమని, వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోల్చడం అత్యంత అభ్యంతరకరమని ఆమె పేర్కొన్నారు. సోనియా గాంధీ గారు ప్రజల ఆకాంక్షను గుర్తించి రాష్ట్రాన్ని ఇచ్చారని, అటువంటి రాష్ట్రాన్ని అవమానించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పాటును ‘బ్లాక్ డే’గా పరిగణించే బీజేపీకి, ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదని ఆమె హెచ్చరించారు.
దేశ జీడీపీకి అధిక వాటా అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు డిలిమిటేషన్ వల్ల సీట్ల సంఖ్యలో అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తారా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును 2023లో ఆమోదించి, అమలును ఎందుకు వాయిదా వేస్తున్నారని నిలదీశారు. కులగణన చేయకుండా రిజర్వేషన్లు అమలు చేస్తే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు అన్యాయం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.
మహిళా శక్తి గురించి మాట్లాడే ప్రధాని మోదీ, దేశంలో మహిళలపై దాడులు జరిగినప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల త్యాగాలను, ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా బీజేపీ నేతలు మాట్లాడటం మానుకోవాలి. మాటలు చెప్పడం కాదు, తెలంగాణకు రావాల్సిన హక్కులను తక్షణమే కల్పించాలి – డాక్టర్ కడియం కావ్య, ఎంపీ (వరంగల్)


