చేనేత వస్త్రాలు మన సంస్కృతికి చిహ్నాలని, వాటిని ఆదరించడం ద్వారా నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు. సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరుగుతున్న ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాను ఆమె సందర్శించారు.
హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయ్, సత్య శారద గార్లతో కలిసి ఎంపీ గారు చేనేత ప్రదర్శన స్టాల్‌ను సందర్శించారు. నేతన్నల నైపుణ్యాన్ని అభినందిస్తూ, వారి శ్రమకు ప్రోత్సాహంగా డాక్టర్ కడియం కావ్య స్వయంగా పలు చేనేత చీరలను కొనుగోలు చేశారు.
“చేనేత మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ప్రతి వస్త్రంలోనూ నేతన్నల కళాత్మకత దాగి ఉంది” అని ఆమె కొనియాడారు. ప్రజలందరూ చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచాలి. స్థానిక ఉత్పత్తులకు ఆదరణ లభిస్తేనే నేతన్నల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి, వారి అభ్యున్నతికి కట్టుబడి ఉంది అని తెలియచేశారు.
రైతు మేళాలో ఎంపీ గారు చూపిన ఈ చొరవ చేనేత కార్మికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.


