హన్మకొండ: వడ్డేపల్లి 60వ డివిజన్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (UPHC) వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి ఆమె ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రూ. 1 కోటి 40 లక్షలతో అత్యాధునిక సదుపాయాలతో ఈ కేంద్రాన్ని నిర్మించారు. పట్టణ ప్రాంత పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం ఇంటి దగ్గరే అందించడం. సాధారణ వైద్య సేవలతో పాటు తల్లి-శిశు సంరక్షణ, చిన్నారులకు టీకాలు, వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా లభిస్తాయి.
ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ప్రతి వార్డులోనూ ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని, ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లే పనిలేకుండా ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య, ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.


