హనుమకొండ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమగ్ర సమాచారం లేకుండా సమావేశాలకు రావడంపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పథకాల వివరాలు, నిధుల వినియోగంపై స్పష్టత లేకుండా వచ్చే అధికారుల తీరు సరికాదని హెచ్చరించారు.
గురువారం హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, అదనపు కలెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.
సమావేశం ప్రారంభంలో పలు శాఖల అధికారులు ప్రాథమిక సమాచారం కూడా లేకుండా హాజరుకావడంపై ఎంపీ మండిపడ్డారు. “శాఖాపరమైన పూర్తి వివరాలు లేకుండా దిశ సమావేశానికి ఎందుకు వచ్చారు?” అని నిలదీశారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్వయంగా హాజరుకాకుండా కింది స్థాయి సిబ్బందిని పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గైర్హాజరైన అధికారుల నుంచి లిఖితపూర్వక వివరణ తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
కేంద్ర నిధులు ఎంతొచ్చాయి, ఎంత ఖర్చు చేశారు, పనులు ఎక్కడ నిలిచాయి, సమస్యలేమిటి అనే సమగ్ర నివేదికతోనే వచ్చే సమావేశానికి రావాలని స్పష్టం చేశారు.
ఎంపీ లాడ్స్ పనులపై ఆరా.. వైద్య సేవల్లో నిర్లక్ష్యంపై నిలదీత:
తన పార్లమెంట్ పరిధిలో 90 శాతం ఎంపీ నిధులను నియోజకవర్గాల వారీగా కేటాయించినప్పటికీ, ఆన్‌లైన్ పోర్టల్‌లో తక్కువ సంఖ్య ఎందుకు నమోదవుతోందని అధికారులను ప్రశ్నించారు. పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేసి, బిల్లుల చెల్లింపులు వేగవంతం చేయాలన్నారు.
వైద్యారోగ్య శాఖ సమీక్షలో భాగంగా జిల్లాలో గర్భిణీల వివరాలు 100 శాతం ఎందుకు నమోదు కావడం లేదని డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పేద రోగులకు ఇన్సులిన్, క్యాన్సర్ ఓపీ సేవలు, వ్యాక్సినేషన్ సక్రమంగా అందేలా చూడాలని, త్వరలోనే తాను స్వయంగా పీహెచ్‌సీలను ఆకస్మిక తనిఖీ చేస్తానని హెచ్చరించారు.
ప్రత్యామ్నాయ పంటలు.. మ్యూజియం అభివృద్ధి:
ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా బాలకార్మిక వ్యవస్థ, బాల్యవివాహాల నిర్మూలనకు గట్టి చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని, వరంగల్ మ్యూజియం సమగ్ర అభివృద్ధికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం క్షయ వ్యాధిగ్రస్తులకు ఎంపీ చేతుల మీదుగా పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, ఆర్డీవో వెంకటేష్, డీఏవో విజయ్ చంద్ర, డీఈవో గిరిరాజు గౌడ్ తదితర అధికారులు పాల్గొన్నారు.


