ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాదం చోటుచేసుకుంది. బేస్తగూడెం గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ రైతు పండించిన పంట కళ్లముందే బూడిదయ్యింది. సుమారు 58 మిర్చి బస్తాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ. 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అంచనా.
అసలేం జరిగింది?
మొక్కజొన్న చేనుకు నిప్పు అంటుకోవడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పక్కనే రాశిగా పోసి ఉంచిన మిర్చి బస్తాలకు ఈ మంటలు అంటుకోవడంతో నిమిషాల్లోనే అంతా దహనమైపోయింది. బాధితుడైన రైతు నవీన్ తన ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు.


