హైదరాబాద్, మే 16: రోగులకు మరియు సామాన్య ప్రజలకు అత్యంత కీలకమైన అలర్ట్. ఈ నెల 20వ తేదీన (బుధవారం) దేశవ్యాప్తంగా మందుల దుకాణాలు (Medical Shops) పూర్తిగా మూతపడనున్నాయి.
ఆన్‌లైన్ ఫార్మసీల (e-Pharmacies) అడ్డగోలు విక్రయాలను, భారీ డిస్కౌంట్లను నిరసిస్తూ ‘ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్’ (AIOCD) ఈ ఒకరోజు జాతీయ స్థాయి బంద్‌కు పిలుపునిచ్చింది.
తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ (TTCDA) కూడా ఈ బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించింది.
బంద్‌కు ప్రధాన కారణాలు మరియు డిమాండ్లు:
కరోనా మహమ్మారి సమయంలో అత్యవసర సేవల కోసం కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ మందుల సరఫరాకు, డోర్ డెలివరీకి కొన్ని తాత్కాలిక సడలింపులు ఇచ్చింది.
ఆ ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని ఫార్మసీ అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి.
ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎలాంటి భౌతిక పరిశీలన లేకుండా, ఒకే ప్రిస్క్రిప్షన్‌ను పదే పదే వాడుతూ మందులు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
పైగా ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో నకిలీ ప్రిస్క్రిప్షన్లు సృష్టించి యాంటీబయాటిక్స్, అలవాటుగా మారే ప్రమాదకరమైన మందులను అక్రమంగా పొందుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్ సంస్థలు ఇస్తున్న భారీ డిస్కౌంట్ల వల్ల దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 12.40 లక్షల మంది రిటైల్ మెడికల్ షాపుల నిర్వాహకులు, వారిపై ఆధారపడ్డ 5 కోట్ల మంది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని కెమిస్ట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ఆరోగ్యమే ముఖ్యం:
మందులు అనేవి కేవలం వ్యాపార వస్తువులు కావని, ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్నాయని AIOCD స్పష్టం చేసింది.
నియంత్రణ లేని ఆన్‌లైన్ విక్రయాలకు ఫుల్‌స్టాప్ పెట్టకపోతే భవిష్యత్తులో ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించింది.
మే 20న అర్ధరాత్రి 12 గంటల నుంచి మరుసటి రోజు అర్ధరాత్రి వరకు ఈ బంద్ కొనసాగనుంది.
అయితే, అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రుల్లోని మెడికల్ షాపులు, కొన్ని అత్యవసర మందుల కౌంటర్లు మాత్రం తెరిచే ఉండే అవకాశం ఉందని సమాచారం.
ఏదేమైనా, సాధారణంగా వాడే మందులను ప్రజలు ముందే కొని పెట్టుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


