వరంగల్ జిల్లా – మార్చి 17, 2026:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం నర్సంపేట మండలం రాజుపేట గ్రామంలోని రైతు వేదికలో సహజ వ్యవసాయం (నేచురల్ ఫార్మింగ్)పై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గారు హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికపై అవగాహన మరియు శిక్షణ చాలా అవసరమని పేర్కొన్నారు.
సహజ వ్యవసాయం ద్వారా పంటల ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా తగ్గడంతో పాటు భూమి సారాన్ని సంరక్షించుకోవచ్చని తెలిపారు. అధికంగా పురుగు మందులు, రసాయన ఎరువులు వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, వాటి నివారణకు రసాయనాల వినియోగాన్ని తగ్గించి సహజ పద్ధతులను అనుసరించాలని సూచించారు.
అలాగే, పురుగు మందులు లేని నాణ్యమైన ఆహారం ఉత్పత్తి చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు.
అనంతరం రైతులకు సహజ వ్యవసాయం కోసం అవసరమైన నేచురల్ ఫార్మింగ్ కిట్లను జిల్లా కలెక్టర్ గారు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జెడి అగ్రికల్చర్ అనురాధ, హార్టికల్చర్ అధికారి శ్రీనివాస్ రావు, నర్సంపేట సహాయ వ్యవసాయ సంచాలకులు దామోదర్ రెడ్డి, వ్యవసాయ అధికారి కృష్ణ, నర్సంపేట తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, ఇతర వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.


