నెల్లికుదురు (మహబూబాబాద్): ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లిన ఒక పేద కుటుంబంలో యుద్ధ జ్వాలలు తీరని శోకాన్ని నింపాయి. సౌదీ అరేబియా-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర యుద్ధ ఉద్రిక్తతలకు మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి బలయ్యారు.
నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన రవిగోపాల్ గత కొంతకాలంగా సౌదీ అరేబియాలో కార్మికుడిగా పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇటీవల ఇరాన్ జరిపిన డ్రోన్ మరియు క్షిపణి దాడుల సమయంలో రవిగోపాల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ దాడుల్లో తగిలిన గాయాల కారణంగా ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం అందింది.
కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రవిగోపాల్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమను ఆదుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


