బ్యాంక్ డిపాజిట్లు, ఆస్తి కొనుగోళ్లపై కొత్త నిబంధనలు.. పాన్ కార్డు వినియోగంలో కీలక మార్పులు:
కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు వినియోగానికి సంబంధించిన నిబంధనలో కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చింది. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెంచడం, భారీ మొత్తాల నగదు చలామణిని నియంత్రించడం లక్ష్యంగా ఈ నిర్ణయాలను అమల్లోకి వచ్చాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం రోజూ వారీగా బ్యాంకుల్లో 50 వేలకు పైగా డిపాజిట్ చేసినప్పటికీ ఇకపై పాన్ కార్డ్ సమర్పించడం అవసరం ఉండదు.
అయితే సంవత్సరానికి 10 లక్షల కు మించిన నగదు విత్ డ్రాల్స్ చేస్తే మాత్రం పాన్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. అదే విధంగా భారీ ఆస్తుల కొనుగోలపై కూడా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. ఇప్పటివరకు 30 లక్షలకు మించిన ఆస్తి లావాదేవీలకు పాన్ అవసరముండగా తాజా మార్పులతో ఈ పరిమితిని 40 లక్షలకు పెంచారు.
అంటే 40 లక్షలకు మించిన స్థిరాస్తి కొనుగోలు లేదా విక్రయాల సమయంలో పాన్ కార్డు వివరాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఐదు లక్షలకు పైబడిన విలువ గలిగిన వాహనాల కొనుగోలులో కూడా పాన్ కార్డ్ సమర్పణ తప్పనిసరి చేశారు. మరోవైపు పాన్ కార్డు లేని వ్యక్తుల కోసం ఇప్పటివరకు ఉపయోగిస్తున్న ఫామ్ 60 స్థానంలో కొత్తగా ఫామ్ 97ను ప్రవేశపెట్టింది. ఈ మార్పులతో ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం కానుందని అధికారులు చెబుతున్నారు.


