తెలంగాణ: ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాన్ని సంక్షేమ పథకాల విస్తరణకు వేదికగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 15 సందర్భంగా కొత్త లబ్ధిదారులను పథకాల పరిధిలోకి తీసుకురావడంతో పాటు పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
2.25 లక్షల మందికి కొత్త పింఛన్లు:
రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 41 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి. తాజాగా తలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులను కూడా పింఛన్ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మొత్తం 11 కేటగిరీల్లో మరో 2.25 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉంది.
5 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్:
మహాలక్ష్మి పథకంలోని రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని కొత్తగా రేషన్ కార్డులు పొందే కుటుంబాలకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 5 లక్షల కుటుంబాలకు ఈ ప్రయోజనం అందే అవకాశం ఉంది.
ఉచిత విద్యుత్ పరిధిలోకి కొత్త కుటుంబాలు:
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రస్తుతం సుమారు 50 లక్షల కుటుంబాలకు అందుతోంది. కొత్త రేషన్ కార్డుదారుల్లో మరో 3 నుంచి 4 లక్షల కుటుంబాలు ఈ పథకంలో చేరే అవకాశం ఉంది.
ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు:
రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా మార్చే ప్రక్రియ ప్రారంభం కానుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. స్మార్ట్ కార్డుల పంపిణీతో పాటు గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించే చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.
TIMS ప్రారంభం.. అభివృద్ధి పనులపై ఫోకస్:
సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)ను ఆగస్టు 15న ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూసీ పునరుజ్జీవనం, గాంధీ సరోవర్, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులపై కూడా కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.


