ఎయిర్‌పోర్టుల్లో కీలక మార్పు.. ఇక బోర్డింగ్ పాస్‌పై స్టాంప్ లేదు :
విదేశాలకు వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ సమయంలో బోర్డింగ్ పాస్‌పై స్టాంప్ వేసే విధానాన్ని నిలిపివేయాలని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ నిర్ణయించింది. ఈ కొత్త విధానం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
డిజిటల్ బోర్డింగ్ పాస్‌కు అనుమతి:
ప్రస్తుతం విదేశీ ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద బోర్డింగ్ పాస్‌ను తప్పనిసరిగా చూపించాలి. అనంతరం అధికారులు దానిపై ఇమ్మిగ్రేషన్ స్టాంప్ వేస్తారు. ఇకపై ఈ ప్రక్రియ అవసరం ఉండదు. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలోని ఎలక్ట్రానిక్ బోర్డింగ్ పాస్‌ను చూపించి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
ప్రింటెడ్ కాపీ ఉన్నా స్టాంప్ ఉండదు:
డిజిటల్ బోర్డింగ్ పాస్ ఉపయోగించలేని వారు ప్రింటెడ్ కాపీని కూడా సమర్పించవచ్చు. అయితే డిజిటల్ లేదా పేపర్ బోర్డింగ్ పాస్ ఏదైనా సరే, దానిపై ఇమ్మిగ్రేషన్ స్టాంప్ వేయరు. ఈ మార్పు వల్ల కౌంటర్ల వద్ద అనవసరమైన ఆలస్యం తగ్గడంతో పాటు ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది.
ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి ఆదేశాలు:
కొత్త విధానంపై ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రయాణికులకు కొత్త నిబంధనలపై అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ విధానంతో అంతర్జాతీయ ప్రయాణ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.


