హన్మకొండ: ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (NPDCL) మరో ప్రతిష్టాత్మక పురస్కారాన్ని దక్కించుకుంది. ఢిల్లీలో జరిగిన 12వ PSU అవార్డ్స్-2026 వేడుకల్లో సంస్థకు ‘గవర్నెన్స్ నౌ’ అవార్డు లభించింది.
ఆపరేషనల్ ఎక్సలెన్స్, ఆటోమేషన్ మరియు డిజిటల్ టెక్నాలజీ విభాగాల్లో చూపిన ప్రతిభకు గాను ఎన్పీడీసీఎల్‌ను ఈ అవార్డు వరించింది. సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సోమవారం హన్మకొండలోని ప్రధాన కార్యాలయంలో ఈ అవార్డును ప్రదర్శించారు. ఇటీవల ఢిల్లీలో కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం ఈ అవార్డును అందుకోగా, దానిని సీఎండీకి అందజేశారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. సంస్థలో డిజిటల్ టెక్నాలజీని వినియోగించుకుంటూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో ఉద్యోగులందరి కృషి ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు మరియు సీఈలు పాల్గొన్నారు.


