తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై చర్చ జరిగింది. వ్యవసాయ రంగంపై జరిగిన చర్చలో భాగంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ… ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని తెరిపారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో రైతులు వరి, పత్తి పంటలకు బదులుగా ఆయిల్ ఫామ్ వైపు మొగ్గు చూపుతున్నారని, అయితే గెలలు నరికిన 24 గంటల్లోపు ప్రాసెసింగ్ చేయకపోతే పంట నాణ్యత దెబ్బతింటుందని తెలిపారు. స్థానికంగానే ఫ్యాక్టరీ ఉంటే రైతులకు రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని వివరించారు. కావున ప్రభుత్వం వెంటనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని మంజూరు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు.
ఎమ్మాల్యే కడియం శ్రీహరి విజ్ఞప్తిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందిస్తూ శాసనసభలో సమాధానమిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ములుగు జిల్లా ఇంచెర్ల, భూపాలపల్లి జిల్లా చైన్పాక ప్రాంతాల్లో ఇప్పటికే ఆయిల్ ఫామ్ మిల్లుల ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. వచ్చే సంవత్సర నాటికి ఈ మిల్లులు రైతులకు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తోందని, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


