హన్మకొండ: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇంధన కొరత సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పెట్రోల్, డీజిల్ నిల్వలు లేక బంకులు మూతపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత కొన్ని రోజులుగా జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే పుకార్లు షికారు చేయడంతో ఒక్కసారిగా వినియోగదారులు బంకుల వద్దకు క్యూ కట్టారు. దీంతో సోమవారం నాడు మాందారిపేట, పరకాల, గూడెప్పాడు వంటి ప్రధాన ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో నిల్వలు నిండుకున్నాయి. బంకు నిర్వాహకులు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టడంతో వాహనదారులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.
పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూలో నిల్చున్నప్పటికీ, చివరి నిమిషంలో స్టాక్ లేదని చెప్పడంపై వాహనదారులు మండిపడుతున్నారు. నిల్వలు అయిపోతాయని తెలిసినప్పుడు యాజమాన్యం ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సిందని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇంధనం లేక వాహనాలు నిలిచిపోవడంతో కార్యాలయాలకు వెళ్లే వారు, అత్యవసర పనుల మీద వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


