ఛార్జింగ్ స్పీడ్ పెరగాలంటే.. ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చండి! :
ఫాస్ట్ ఛార్జర్, మంచి కేబుల్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు స్మార్ట్‌ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ రన్ అవడం, ఫోన్ వేడెక్కడం, నాణ్యత లేని ఛార్జర్ వాడటం వంటి కారణాలతో ఛార్జింగ్ స్పీడ్ తగ్గొచ్చు. కొన్ని సింపుల్ జాగ్రత్తలు పాటిస్తే ఫోన్‌ను వేగంగా, సురక్షితంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
ఫ్లైట్ మోడ్ ఆన్ చేయండి:
ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం వల్ల మొబైల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్ వంటి కనెక్షన్లు నిలిచిపోతాయి. దీంతో బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే కార్యకలాపాలు తగ్గి బ్యాటరీ వినియోగం కూడా తగ్గుతుంది. ఫలితంగా ఛార్జింగ్ వేగం కొంత మెరుగుపడొచ్చు.
నాణ్యమైన ఛార్జర్‌నే వాడాలి:
ఫోన్ తయారీ సంస్థ సూచించిన లేదా సర్టిఫైడ్ ఛార్జర్, కేబుల్‌ను ఉపయోగించడం మంచిది. చౌకైన, నాణ్యత లేని ఛార్జర్లను వాడటం వల్ల ఛార్జింగ్ నెమ్మదించడంతో పాటు బ్యాటరీ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కంపెనీకి చెందిన ఒరిజినల్ లేదా నాణ్యమైన సర్టిఫైడ్ ఛార్జర్‌ను ఎంచుకోవాలి.
ఛార్జింగ్ సమయంలో ఫోన్ వాడొద్దు:
ఛార్జింగ్ పెట్టి వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం, సోషల్ మీడియా వినియోగించడం వల్ల బ్యాటరీపై అదనపు లోడ్ పడుతుంది. దీంతో ఛార్జింగ్ సమయం పెరుగుతుంది. వీలైనంత వరకు ఫోన్‌ను పక్కన పెట్టి ఛార్జ్ చేయడం మంచిది. అవసరం లేకపోతే బ్లూటూత్, మొబైల్ డేటా వంటి కనెక్షన్లను కూడా ఆఫ్ చేయవచ్చు.
ఛార్జింగ్ యాప్స్‌కు దూరంగా ఉండండి:
ఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేస్తామని చెప్పే థర్డ్ పార్టీ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి సాధారణంగా ఛార్జింగ్ వేగాన్ని పెంచలేవు. పైగా బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ బ్యాటరీ వినియోగాన్ని పెంచే అవకాశం ఉంది.
ఫోన్ వేడెక్కకుండా చూసుకోండి:
ఛార్జింగ్ సమయంలో ఫోన్‌ను నేరుగా ఎండలో లేదా వేడి ప్రదేశంలో ఉంచకండి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా బ్యాటరీ పనితీరు ప్రభావితమై ఛార్జింగ్ స్పీడ్ తగ్గవచ్చు. అందువల్ల గాలి ప్రసరణ ఉన్న చల్లని ప్రదేశంలో ఫోన్‌ను ఛార్జ్ చేయడం ఉత్తమం.ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఛార్జింగ్ సమయాన్ని తగ్గించడంతో పాటు బ్యాటరీ ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా కాపాడుకోవచ్చు.


