పట్టా భూములకు 22ఏ సెగ.. రంగారెడ్డి జిల్లాలో రైతుల ఆవేదన..:
రంగారెడ్డి జిల్లాలో విలువైన భూములు, ప్లాట్లను కారణాలు స్పష్టంగా పేర్కొనకుండానే 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాబితా నుంచి ఆస్తులను తొలగించాలని బాధితులు అధికారులకు దరఖాస్తులు చేస్తున్నా.. పరిష్కారం లభించడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం తప్పులుంటే సవరిస్తామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
నాదర్గుల్లో రైతుల ఫిర్యాదులు:
బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలోని 597, 599, 615, 616, 617, 618 సర్వే నంబర్లలోని భూములను 22ఏ జాబితాలో చేర్చారని పలువురు రైతులు చెబుతున్నారు. ఇవి తమ పట్టా భూములని, ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని రైతు మర్రి సురేందర్‌రెడ్డి తెలిపారు. జాబితా నుంచి భూములను తొలగించాలని బాలాపూర్ తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
తహసీల్దార్ విచారణ అనంతరం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని సిఫారసు చేస్తూ ఆర్డీవోకు నివేదిక పంపినట్లు రైతులు చెబుతున్నారు. అనంతరం ఆర్డీవో కూడా కలెక్టర్ కార్యాలయానికి నివేదిక పంపినా.. అక్కడి నుంచి ఎన్ఓసీ జారీ కావడంలో జాప్యం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్లాట్ల యజమానుల్లో ఆందోళన:
తుర్కయంజాల్, ఆదిబట్ల, తుక్కుగూడ, శంషాబాద్, రాజేంద్రనగర్, పెద్దఅంబర్‌పేట, గండిపేట్ ప్రాంతాల్లోనూ పలు ప్లాట్లు 22ఏ జాబితాలో ఉన్నాయని యజమానులు చెబుతున్నారు. అప్పులు చేసి కొనుగోలు చేసిన ప్లాట్లను విక్రయించేందుకు ప్రయత్నించినప్పుడు నిషేధిత జాబితాలో ఉన్న విషయం తెలిసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాబితా నుంచి తొలగించినట్లు ఎన్ఓసీ తీసుకొస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల అధికారులు చెబుతున్నారని బాధితులు తెలిపారు.
ప్రజావాణికి బాధితుల క్యూ:
భూములు, ప్లాట్లను జాబితా నుంచి తొలగించాలంటూ తహసీల్దార్ కార్యాలయాలతోపాటు కలెక్టరేట్, డివిజన్ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిలో బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆస్తుల తొలగింపు ప్రక్రియలో తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ స్థాయిలో పరిశీలన జరగాల్సి ఉంటుందని చెబుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం ఆస్తులు విక్రయించాల్సి ఉన్నా ఎన్ఓసీలు అందక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం 22ఏ జాబితాను సమీక్షించి, అర్హత ఉన్న ఆస్తులను త్వరగా తొలగించాలని వారు కోరుతున్నారు.


